పండరీపురం పాండురంగ ఉత్సవం :
పండరీపురం పాండురంగ ఉత్సవం :
శ్రీకృష్ణుడు అవతారం చాలించిన తరువాత కూడా పుండరీకునికి ప్రత్యక్ష సన్నిహితునిగా మెలిగాడని పురాణగాథలు పేర్కొంటాయి. జ్ఞానేశ్వర్, తుకారాం, సక్కుబాయి వంటి కృష్ణభక్తులు ఆయనను ప్రత్యక్షంగా దర్శించినవారే. విఠలునిగా పండరీపురంలో నెలకొన్న కృష్ణస్వామిని తొలి ఏకాదశి వేళలో దర్శించేందుకు వార్కరీలని పిలిచే వేలాది భక్తులు వందలాది కిలోమీటర్ల దూరం పాదయాత్రగా తరలివస్తారు.అళంది, దేహు క్షేత్రాల నుంచి 250 కిలోమీటర్ల దూరం భక్తులు పాదయాత్రగా వస్తారు. ఇరవై ఒక్కరోజుల పాటు కొనసాగే ఈ పాదయాత్రనే మరాఠీలు వార్కరీ అని పిలుస్తారు.
ఆషాఢం.. ఆధ్యాత్మికంగా ఎన్నో ప్రత్యేకతలు కలిగిన మాసం. అనేక ప్రాంతాల్లో సాంస్కృతిక అస్తిత్వానికి ప్రతీకలుగా నిలిచే పండుగలకూ ఉత్సవాలకూ కీలకమైన నెల. తెలంగాణలో బోనాల పండుగ, ఒడిషాలో పూరీ జగన్నాథుని రథయాత్ర అలాంటివే! ఆ కోవకు చెందిన వేడుకే .. ‘వార్కరీ’. మహారాష్ట్రలో కుల వివక్షకు వ్యతిరేకంగా మొదలైన భక్తి ఉద్యమం.. వార్కరీ యాత్రలతో విజయతీరాలకు చేరింది. వారీ అంటే యాత్ర. కారీ అంటే యాత్రికులు. కాలినడకన ప్రయాణిస్తూ భక్తి పరమార్థాన్ని పదిమందికీ పంచడమే ‘వార్కరీ’.
ప్రస్తుతం పండరీపురంలో కనిపించే విఠల రఖుమాయి దేవాలయ నిర్మాణానికి చారిత్రక పురుషుడైన పుండలీకుడే ఆద్యుడని ఆధారాలు చెబుతున్నాయి. మరాఠీ, కన్నడ సాహిత్యాలలోనూ పుండలీకుడి ప్రస్తావనలున్నాయి. పుండలీకుడు కృష్ణ భక్తుడు. వృద్ధులైన తల్లిదండ్రుల సేవలో తరించాడు. అతడి సేవకు మెచ్చిన కృష్ణుడు, పుండలీకుడి ఇంటికి వెళ్లి ‘ఏం వరం కావాలో కోరుకో’ అన్నాడు. పుండలీకుడు మాత్రం ‘నేను ఇప్పుడు తల్లిదండ్రుల సేవలో ఉన్నాను. పూర్తయ్యాకే బయటకు వస్తాను. అప్పటి దాకా ఈ ఇటుక మీద నిలబడి వేచి ఉండు’ అంటూ ఒక ఇటుకను బయటికి విసిరాడు. దీంతో, శ్రీకృష్ణుడు రెండు చేతులనూ నడుము మీద పెట్టుకొని, పుండలీకుడు వచ్చేవరకు ఇటుకపైనే నిలబడ్డాడు. ఆ తర్వాత ఎప్పుడో ఇంట్లోంచి బయటకు వచ్చిన పుండలీకుడు.. అలా ఇటుక మీద నిలబడిన రూపంలోనే భక్తులకు దర్శన భాగ్యం కలిగించమని కృష్ణుడిని కోరుకున్నాడు. దీంతో శ్రీకృష్ణుడే విఠలుడిగా, విఠోబాగా ఆ రూపంలోనే పండరిలో వెలిశాడు. అంతకు ముందు నుంచే అమ్మదేవతగా వెలసిల్లిన రఖుమాయి, సాంస్కృతిక సమ్మేళనం తర్వాత విఠోబా భార్యగా భక్తులతో పూజలందుకుంటున్నది. అందుకే పండరిలో విఠోబాకు, రఖుమాయికి వేర్వేరు ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ రెండు రకాల ఆరాధనా పద్ధతులు కనిపిస్తాయి. ఒకటి మందిరం లోపల నిర్వహించే బ్రాహ్మణీయ పూజలు, మరొకటి విస్తృత ప్రజానీకం భక్తి భావనతో చేసుకునే గ్రామీణ ఆరాధన. ఇందులో రెండోది.. శూద్ర కులాల నుంచి ఉద్భవించి, సంత్‌ల ద్వారా స్థిరపడ్డ వార్కరీ సంప్రదాయం.
హారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో భీమానది ఒడ్డున వెలిసిన ప్రసిద్ధ యాత్రాస్థలం పండరీపురం. ఇది విఠలుడి కేంద్రస్థానం. విష్ణు స్వరూపుడైన శ్రీకృష్ణుడి అంశగా విఠలుడిని కొలుస్తారు భక్తులు. మహారాష్ట్రతో పాటు.. కర్ణాటక, గోవా, తెలంగాణలకూ విఠలుడు ఆరాధన వ్యాప్తిచెందింది. అందుకే విఠల్, పండరిలాంటి పేర్లు తెలంగాణ సమాజంలో విస్తారంగా వినిపిస్తాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల్లోని ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో విఠలుడి ఆరాధన ఎక్కువ. పాండురంగస్వామి ఆలయాలూ కనిపిస్తాయి. ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లోని విఠలేశ్వరాలయం సుప్రసిద్ధం.
ఏటా ఆషాఢశుద్ధ ఏకాదశికి పండరీపుర క్షేత్రంలో వార్కరీ ఉత్సవం జరుగుతుంది. వారి అంటే యాత్ర... కారి అంటే నిర్వహించేవారు అని అర్థం. ప్రయాణం చేస్తూ పరమార్థాన్ని పదిమందికీ పంచడమే వార్కరీ సంప్రదాయం. క్రీ.శ 13వ శతాబ్ధానికి చెందిన జ్ఞానేశ్వర్ మహారాజ్ సమాధి క్షేత్రం అళంది నుంచి, క్రీ.శ. 17వ శతాబ్దానికి చెందిన భక్త తుకారాం సమాధి ఉన్న దేహు నుంచి పాద యాత్రలు ప్రారంభమవుతాయి. ఆ రెండు క్షేత్రాల నుంచి నిర్వహించే 250 కిలోమీటర్ల పాదయాత్రనే వార్కరీ యాత్రగా పిలుస్తారు. ఇందులో భాగంగా అళంది నుంచి జ్ఞానేశ్వర్ పాదుకలను, దేహు నుంచి తుకారం పాదుకలను పల్లకీల్లో తీసుకెళతారు. 21 రోజులపాటు జరిగే ఈ పాదయాత్రలు సరిగ్గా తొలిఏకాదశి ముందు రోజు పండరీపురం చేరుకుంటాయి. భక్తులు ఎంతో దీక్షతో, క్రమశిక్షణతో సాగించే భక్తియాత్ర ఇది. ఇందులో పాల్గొనే భక్తులు కఠోర నియమాలు పాటిస్తారు. మద్యమాంసాలు, ఉల్లి వంటి వాటికి దూరంగా ఉంటారు. బ్రహ్మచర్యం పాటిస్తారు. పాదరక్షలు లేకుండా నడుస్తారు. మెడలో తులసిమాల ధరిస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి భక్తుణ్ణి పాండురంగడిగా భావించి ఆదరిస్తారు. కులం, ప్రాంతంతో సంబంధం లేకుండా సమూహాలుగా భజనలు, పాటలు పాడుకుంటూ ముందుకు సాగుతారు. ఈ వార్కరీ ఉద్యమం మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోనిపలు ప్రాంతాల నుంచి కూడా యాత్ర జరుగుతుంది.
Comments
Post a Comment